కలికాలంలో సామెతలు!!!
పెద్దల మాట చద్దన్నంమూట- ఇప్పటితరానికి వేడివేడిగా తినటం అలవాటు కదా, అందుకని పెద్దవాళ్ల మాట వినరు మరి!
పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు-అందుకనే ఇల్లుగలాయన మాట కూడా ఇంట్లోవాళ్లకి పట్టదు మరి!
కూచొని తింటే కొండలైనా కరుగుతాయి-అందుకనే ఈ తరం పరుగెడుతూ తింటున్నారు! రెక్కాడితేగానీ డొక్కఆడదు- అందుకనే రెక్కలాడిచ్చకుండానే డొక్కలాడిచ్చు కుంటున్నాం-సిస్టమ్ ముందు కూచ్చోని!
తొచీతోచనమ్మ పుట్టింటి కెళ్ళిందని- మాకు ఆ అవసరం లేదు.సోషల్ మీడియాలో "ముచ్చట్లు డాట్ కామ్" లో కాలక్షేపం చేస్తాం,ఎన్ని రోజులైనా!
పిల్లలు పుట్టాలని సముద్ర స్నానానికి వెళితే నీళ్ళలో పెళ్ళాం కొట్టుకుపోయినట్టు లాప్ టాప్, మొబైల్ బ్యాటరీ చార్జ్ చేద్దామంటే కరెంట్ పోయినట్టు!
కాలికి అంటినదాన్ని నెత్తికి అంటుకున్నట్టు అయ్యింది-గర్ల్ ఫ్రెండ్లా ఉంచుకుంటే సరిపోయేదాన్ని పెళ్లి చేసుకున్నట్లు!
తామరాకు మీద నీటిబొట్టు చందంగా-చుట్టుపక్కల అమ్మాయిల హాస్టల్స్ ఉంచుకొని రూంలో ఒంటరిగా కూచ్చున్నట్లు!
అన్నీ తెలిసినవాడు అమవాస్యనాడు పోతే, ఏమీ తెలియనివాడు ఏకాదశినాడు పోయినట్టు అన్నీ తెలుసు అనుకునే "అర్బనోడు" అన్నీ మూసుకుని ఇంట్లో కూచుంటే, ఏమీ తెలియదనుకునే "పల్లెకారు" నిర్భయంగా తిరుగుతున్నట్టు!
పాండవుల రాజ్యం కౌరవుల తద్దినాలకే సరిపోయిందని- ఆరుగాలం రైతు పండించినదంతా,మన "లాక్ డౌన్" తిండికే సరిపోతున్నట్టు!
ఇంక ఉంటా, ఆత్మా రాముడు పూజ ఒకటి ఉందిగా మరి, లోక్డౌన్ ఆయే, మరీమరీ పూజ చెయ్యలాయే మరి!( ఈ లాక్డౌన్ లో మూడు పూటలా చెయ్యాల్సి వస్తోంది)